చరిత్రలో తొలిసారి 10 గ్రాముల ధర రూ.50 వేల పైకి...

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విలయం, వైరస్‌ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న ఉద్దీపన చర్యలు, కరెన్సీ మారక విలువలు పడిపోవడం తదితర అంశాల ఊతంతో పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ధోరణులను ప్రతిబింబిస్తూ దేశీయంగా తొలిసారిగా రూ.50,000 మార్కు దాటేసింది. మల్టీకమోడిటీ ఎక్స్ఛ్‌ంజీ (ఎంసీఎక్స్‌)లో బుధవారం రూ. 49,931 (10 గ్రాములు) వద్ద ప్రారంభమైన పసిడి ఫ్యూచర్స్‌ ఆ తర్వాత రూ. 50,085 రికార్డు స్థాయిని తాకింది.
అటు న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో మేలిమి బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 50,920ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు (33.3 గ్రాములు) 1,860 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. క్రమంగా 2011 సెప్టెంబర్‌లో ఇంట్రాడేలో నమోదైన 1,911.60 డాలర్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి దిశగా బంగారం రేటు పరుగులు తీస్తోంది. అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్టు (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ చెప్పారు.  
కరెన్సీల క్షీణత కూడా కారణం..
  • సాధారణంగా ఎకానమీ, స్టాక్‌ మార్కెట్ల పరిస్థితులు బాగా లేనప్పుడు సురక్షిత సాధనంగా పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. అయితే, ప్రస్తుతం బంగారం రేట్ల జోరుకు ఇదొక్కటే కారణం కాదని  షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ సింగ్‌ తెలిపారు. యూరప్, అమెరికాలో ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యల కారణంగా కీలక కరెన్సీలు క్షీణిస్తుండటం వల్లే బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయని వివరించారు.