సెన్సెక్స్‌ 194 పాయింట్లు మైనస్‌

కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన పలు సవాళ్లతో బ్యాంకింగ్‌ రంగం సమస్యలను ఎదుర్కోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్‌ తాజాగా అభిప్రాయపడింది. ఈ ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకూ వాణిజ్య బ్యాంకుల స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 8.5 శాతం నుంచి 12.5 శాతానికి పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఆర్థిక మందగనం, విదేశీ పరిస్థితులు, మారటోరియం తదితర పలు అంశాలు బ్యాంకింగ్‌ రంగానికి సవాళ్లు విసురుతున్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 194 పాయింట్లు క్షీణించి 37,935 వద్ద నిలవగా.. నిఫ్టీ 62 పాయింట్ల వెనకడుగుతో 11,132 వద్ద ముగిసింది. అయితే మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,275-37,769 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ సైతం 11,225- 11,088 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
ఫార్మా, రియల్టీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 4 శాతం పతనంకాగా.. ఫార్మా, రియల్టీ 1.7 శాతం చొప్పున క్షీణించాయి. అయితే ఐటీ 2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ బ్యాంక్‌ 6 శాతం పతనంకాగా.. జీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్, ఇండస్‌ఇండ్‌, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా,, గ్రాసిమ్‌ 4-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. మరోవైపు ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, బజాజ్‌ ఆటో 3.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. 
ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఈక్విటాస్‌, ఉజ్జీవన్‌, ఎన్‌సీసీ, ఆర్‌ఈసీ, ఇండిగో, జీఎంఆర్‌, ఐడియా 9-4 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా..  జిందాల్‌ స్టీల్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, నిట్‌ టెక్‌, మైండ్‌ట్రీ, అంబుజా సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 5.4-2.4 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1809 నష్టపోగా.. 869 లాభపడ్డాయి.