కోరమాండల్‌ లాభం 301 శాతం జంప్‌

ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 301 శాతం అధికమై రూ.250 కోట్లు నమోదు చేసింది. నెట్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ 4.87 శాతం పెరిగి 7.8 శాతంగా ఉంది. ఎబిటా 113 శాతం హెచ్చి రూ.415 కోట్లుంది. టర్నోవరు రూ.2,141 కోట్ల నుంచి రూ.3,224 కోట్లకు దూసుకెళ్లింది.
ఒకవైపు కోవిడ్‌–19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు నమోదు చేశామని సంస్థ ఎండీ సమీర్‌ గోయల్‌ ఈ సందర్భంగా తెలిపారు. నూట్రియెంట్‌ మరియు అనుబంధ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని చెప్పారు. ఫాస్ఫాటిక్‌ ఫెర్టిలైజర్‌ విక్రయాలు 75 శాతం అధికమైందని వెల్లడించారు. మార్కెట్‌ వాటా 13.2 నుంచి 16 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు.