30న ముగియనున్న జులై ఎఫ్‌అండ్‌వో

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా భారీ హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు ఊహిస్తున్నారు. ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై  ప్రభావాన్ని చూపగల అమెరికన్‌ కేంద్ర బ్యాంకు.. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. మంగళవారం ప్రారంభంకానున్న పరపతి సమావేశాలు బుధవారం(29న) ముగియనున్నాయి. మరోవైపు జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ గడువు గురువారం(30న) ముగియనుంది. దేశీయంగా నేడు(25న) ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనుంది. ఈ అంశాల నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సంచరించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఫెడ్‌పై కన్ను
ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటా పాకిన కోవిడ్‌-19.. కొద్ది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాలలో మరింత వేగంగా విస్తరిస్తోంది. 50 రాష్ట్రాలలో 42 రాష్ట్రాలు కరోనా వైరస్‌తో వణుకుతున్నాయి. దీంతో వాషింగ్టన్‌ ప్రభుత్వం మరో భారీ ప్యాకేజీని ప్రకటించవచ్చన్న అంచనాలు ఇటీవల పెరిగాయి. జులైలో నిరుద్యోగిత పెరగడంతో ప్రజలకు ప్రత్యక్షంగా నగదు చెల్లించే పథకాన్ని సెనేట్‌ రిపబ్లికన్స్‌ ప్రతిపాదించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌  పాలసీ సమీక్షకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా, చైనా మధ్య తాజాగా వివాదాలు చెలరేగిన విషయం విదితమే. దీంతో దేశ ఆర్థిక వృద్ధిపై ఫెడ్‌ అంచనాలు స్టాక్‌, ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగలవని నిపుణులు చెబుతున్నారు.