రాష్ట్రంలో 33 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్యంగా అడుగులేస్తున్న సర్కారు

రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అటవీ విభాగానికి చెందిన అన్ని నర్సరీలు రకరకాల మొక్కలతో కొత్త కళ సంతరించుకున్నాయి. మొక్కలు నాటే పండుగ వన మహోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ బృందం ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు, కొత్తపట్నం నర్సరీలను సందర్శించింది. వాతావరణం అనుకూలించడంతో నర్సరీల్లో మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. నల్లని, తెల్లని పాలిథిన్‌ సంచుల్లో లైను కట్టినట్లున్న రకరకాల మొక్కలతో నర్సరీలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆరు కోట్లకు పైగా మొక్కలతో సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీలు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. ఉద్యానవన విభాగం, ప్రయివేటు నర్సరీల్లో 6.03 కోట్ల మొక్కలు సిద్ధమయ్యాయి.
ఒక్కొక్కరు ఒక్కో మొక్క..
► గత ప్రభుత్వాలు మొక్కలు నాటి, వాటి సంరక్షణ గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి చెట్టుగా మారేలా చూడాలని సీఎం జగన్‌ ఆదేశిం చారు. దీంతో  ప్రభుత్వం ‘ఒక్కొ క్కరు ఒక్కో మొక్క’ నాటి సం రక్షించాలనే నినాదం తెచ్చింది. 
► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను ప్రణాళికా బద్ధంగా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
​​​​​​​► అన్ని రకాల రహదారులు, విద్యా సంస్థలు, పారిశ్రా మిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతారు. 
33% గ్రీన్‌ కవర్‌ లక్ష్యం
​​​​​​​► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్‌ ఇప్పుడు పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టారు. 
​​​​​​​► జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్‌ కవర్‌ (పచ్చదనం) సాధన లక్ష్యంగా ముందుకెళ్లాలన్న సీఎం మార్గనిర్దేశం మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 
​​​​​​​► రాష్ట్ర అటవీ శాఖ నోడల్‌ ఏజెన్సీగా అటవీ శాఖతో పాటు 29 ప్రధాన శాఖలు ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, వన సంరక్షణ సమితుల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
​​​​​​​► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉంది. ఇందులో 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం చెట్లు ఉన్నాయి. 
నాలుగు రకాల ప్లాంటేషన్లు
ఎవెన్యూ ప్లాంటేషన్‌: జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు పెంచుతారు. వేప, చింత, కానుగ, మర్రి, రావి, నిద్రగన్నేరు, బాదం, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు.
బ్యాంక్‌ ప్లాంటేషన్‌: స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి టేకు, సుబాబుల్, మలబార్‌ నీమ్, వేప 
తదితర మొక్కలను నాటుతారు. 
బ్లాక్‌ ప్లాంటేషన్‌: చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయాల 
భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటుతారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి మోదుగ, ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్‌ ఉడ్, నేరవేప, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు నాటుతారు.  
ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, చింత, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా తదితర మొక్కలను నాటుతారు.