36 గంటలు గడిచినా.. లభించని సింధూజ ఆచూకీ

శనివారం ఉదయం కలుగొట్ల వాగులో కారు కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతయిన సింధూజ రెడ్డి ఆచూకీ 36 గంటలు గడిచిన ఇంకా లభించలేదు. ఏపీలోని కడప జిల్లాకు చెందిన శివకుమార్ రెడ్డి కుటుంబం బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే క్రమంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద కరోనా పరీక్షలు చేస్తారేమోనని భయపడి అడ్డదారిలో వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో కారును జాతీయ రహదారి నుంచి గ్రామాల మీదగా మళ్లించారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఉండవెల్లి మండలం పుల్లూరు నుంచి కలుగొట్ల మీదగా కారుని పోనిచ్చారు.
జోరు వాన...పైగా చీకట్లో కలుగోట్ల వాగు ఉధృతిని అంచనా వేయలేక వేగంగా వాగు దాటించే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెరిగిన వాగు ఉధృతిలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శివకుమార్ రెడ్డి, అతడి స్నేహితుడు జిలానీ బాషా ప్రాణాలతో బయటపడ్డారు. శివకుమార్ రెడ్డి భార్య సింధూజ గల్లంతు కావడంతో నిన్నటి నుంచి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో డిఎస్పీ యాదగిరి,స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. నిన్న రాత్రి ఏడు గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా సింధూజ ఆచూకీ లభించలేదు. దీంతో మళ్లీ ఆదివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.