రైతులకు లబ్ధి చేకూరేలా రూ.4,000 కోట్లతో ప్రణాళిక

రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్‌ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీ లేదా కోల్డ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, కోల్డ్‌ రూమ్‌లు, ఆర్‌బీకేలలో గ్రేడింగ్, సార్టింగ్‌ పరికరాలు, యంత్రాల కోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఆ మేరకు వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. 
ఆర్‌బీకేలు–గోదాములు–సదుపాయాలు
► ఆర్‌బీకేలకు అనుబంధంగా నిర్మించే గోదాముల్లో సార్టింగ్, గ్రేడింగ్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. వీటి కోసం సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
► ఆయా ఆర్బీకేల పరిధిలో పండే పంటలను దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. 
► ప్రతి ఆర్బీకేలో తేమను కొలిచే యంత్రం, వేయింగ్‌ బాలెన్స్, కాలిపెర్స్, లాబ్‌వేర్‌లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ.92.2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.
రైతులకు తెలుగులో సమాచారం
 ► రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఆర్‌బీకేలలో అందివ్వగానే, ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉందన్న సమాచారం, వ్యాపారుల వివరాలు వెంటనే తెలుగు భాషలో తెలియజేసేలా సదుపాయం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇందు వల్ల రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తుందని వివరించారు. 
► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పంటల అమ్మకాలకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌
► రైతులు తమ పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌బీకేలలో అందిస్తారు. అక్కడ నుంచి ఆ సమాచారం సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుంది. ఈ సమాచారాన్ని అందుకోగానే రైతుల పంట కొనుగోలు జరిగేలా చూడాలి. 
► కనీస గిట్టుబాటు ధరకన్నా, తక్కువకు అమ్ముకునే పరిస్థితులు ఉంటే ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకోవాలి.
► ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా సాగడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్‌ నాటికి తయారు చేయాలి. ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.