ఎల్‌ఐసీ హౌసింగ్‌ రుణ రేటు 6.90%

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ గృహ రుణాలపై వడ్డీ రేటును కంపెనీ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి 6.90 శాతానికి తగ్గించినట్టు ప్రకటించింది. 700 అంతకుమించి సిబిల్‌ స్కోరు ఉన్న వారికి రూ.50 లక్షల వరకు గృహ రుణంపై ఈ రేటును ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఒకవేళ రూ.50 లక్షలకు మించి రుణానికి దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటు 7%గా వసూలు చేయనుంది. కంపెనీ రుణాల్లో 25% మారటోరియంలో ఉన్నట్టు ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈవో సిద్ధార్థ్‌ మొహంతి తెలిపారు. రూ.13,000 కోట్ల నిర్మాణ రంగ రుణాల్లో రూ.8,500–9,000 కోట్లు మారటోరియం పరిధిలో ఉన్నట్టు చెప్పారు.  
పెన్షనర్లకు గృహరుణ పథకం
పెన్షనర్లకు ప్రత్యేక పథకాన్ని ‘గృహ వరిష్ట’ పేరుతో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఆవిష్కరించింది. దీని కింద గృహ రుణాన్ని 80 ఏళ్ల వయసు వరకు కాల వ్యవధిపై లేదా 30 ఏళ్లు ఏది తక్కువ అయితే ఆ కాలానికి రుణాన్ని అందిస్తుంది. రిటైర్మెంట్‌ తీసుకున్న లేదా ప్రస్తుతం సర్వీసులో ఉండి భవిష్యత్తులో కచ్చితమైన పెన్షన్‌ సదుపాయం కలిగిన కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థ ల ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికింద అధిక రుణం కావాలంటే ఆర్జనా శక్తి కలిగిన తమ పిల్లలతో కలసి పెన్షన్‌ దారులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవచ్చు.