ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
వారంపైగా ఎంసెట్ పరీక్షలు
కరోనా నేపథ్యంలో సెట్స్ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది.