ఆర్థిక పరిస్థితులు సమీక్షిస్తున్నాం..తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం

దేశ ఆర్థిక స్థితిగతులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వృద్ధికి ఊతమిచ్చేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. కరోనా వైరస్‌ సంక్షోభంతో సతమతమవుతున్న ఇన్‌ఫ్రా రంగాన్ని మళ్లీ వృద్ధి బాట పట్టించేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమవర్గాలకు సూచించారు. గతంలో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు తరహాలో మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో ఎకానమీకి గణనీయంగా తోడ్పాటు లభిస్తుందని పేర్కొన్నారు.
‘తూర్పు–పశ్చిమ, ఉత్తరాది–దక్షిణాది మధ్య ఎక్స్‌ప్రెస్‌వే, హై స్పీడ్‌ రైల్‌ కారిడార్లు మొదలైన వాటి రూపంలో ఈ ప్రాజెక్టులు ఉండచ్చు. ఇలాంటి రెయిల్, రోడ్‌ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో వాటి చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలు, ఎకానమీలోని ఇతర రంగాలకు కనెక్టివిటీ లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సాకారానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులు... రెండూ కీలకమే‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్‌ చెప్పారు. నీతి ఆయోగ్‌ అంచనాల ప్రకారం దేశీయంగా 2030 నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు.  
ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ..: ఇన్‌ఫ్రా రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో భారీగా మొండిబాకీలు పేరుకుపోయిన నేపథ్యంలో నిధుల సమీకరణకు ఇతరత్రా అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని దాస్‌ చెప్పారు. వన్‌–టైమ్‌ రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కార్పొరేట్‌ బాండ్లను ఆర్‌బీఐ నేరుగా కొనుగోలు చేయాలన్న పరిశ్రమ వర్గాల సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
‘ఆర్‌బీఐ చాలా అప్రమత్తంగా ఉంది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోంది. అవసరమైనప్పుడు.. తగిన చర్యలు తీసుకోవడంలో సందేహించే ప్రసక్తే లేదు. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమకు తోడ్పాటునిచ్చే అంశంలో ఆర్‌బీఐ వ్యవహరించిన తీరు మీకు తెలిసిందే. రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పుడూ క్రియాశీలకంగానే వ్యవహరిస్తుంది‘ అని దాస్‌ తెలిపారు. కరోనా పరిణామాలతో మొండిబాకీలు పెరిగి, సమస్య మరింత జటిలమయ్యే దాకా చూస్తూ కూర్చోకుండా బ్యాంకులు .. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని దాస్‌ సూచించారు.