సాయం చేద్దామ‌నుకుంటే ప్రాణాలే పోయాయి

అనారోగ్యంతో ఉన్నాం.. మందులు కావాలి అన‌గానే పాపం ఆ డాక్ట‌ర‌మ్మ న‌మ్మింది. వ‌చ్చింది కేటుగాళ్లు అని తెలుసుకోలేక‌పోయింది. సాయం చేద్దామ‌న‌కున్న ఆమెనే హ‌త‌మార్చేశారు దుండ‌గులు. ఈ ఘ‌ట‌న సోమ‌ర‌వారం చిత్తూరు జిల్లాలోని కొత్త‌పేట‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేసిన డాక్ట‌ర్ కృష్ణ‌వేణి అనే మ‌హిళ ప‌ది సంవ‌త్స‌రాల క్రితం ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఈమె భ‌ర్త చంద్ర‌య్య చ‌నిపోవ‌డంతో గ్రామంలోనే ఉంటూ ఓ ప్రైవేట్ క్లినిక్ న‌డిపేది.
స్థానికుల‌కు ఏ అనారోగ్యం త‌లెత్తినా డాక్ట‌ర‌మ్మా అంటూ ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా ప‌రిగెత్తుకొని వ‌స్తుంటారు. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం దుండ‌గులు అనారోగ్యం అని చెప్ప‌డంతో కృష్ణ‌వేణి త‌లుపులు తెరిచింది. దీంతో దుండ‌గులు ఆమెపై దాడిచేసి, గొంతుకోసి ఆమె ఒంటిపై ఉన్న న‌గ‌ల‌తో పారిపోయారు. ఉద‌యం ప‌నిమ‌నిషి వ‌చ్చి చూడ‌గా కృష్ణ‌వేణి అప్ప‌టికే రక్త‌పు మ‌డుగులో క‌నిపించింది. అనంత‌రం స్థానికుల ద్వారా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. అతి త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని తెలిపారు.