ఇంగ్లండ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు పర్యటన రద్దు!

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన రద్దయింది. కరోనా కారణంగా మన జట్టు అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి లేదు కాబట్టి టూర్‌ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌లోనే భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 3 టి20ల్లో తలపడాల్సింది. అప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా... ఇప్పుడు పూర్తిగా రద్దయినట్లే. అయితే వచ్చే సెప్టెంబరులోనైనా భారత్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ముక్కోణపు టోర్నీ నిర్వహించాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అయితే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సెప్టెంబర్‌లోనూ భారత్‌ మహిళల జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించే అవకాశం లేదు. ఒకవేళ భారత్‌ రాకపోతే దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడే అవకాశం ఉంది.