అభివృద్ధి చేస్తే అద్భుతమే.!

ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజుల్లో మన్యంలోని ఓ తెగతో పన్ను వసూళ్లకు ముఠాదారి వ్యవస్థను ఏర్పాటుచేశారు. వీరితో సమావేశాలు నిర్వహించడానికి ఎండ్రిక పర్వతాన్ని వేదికగా చేసుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పరిపాలనపరమైన అంశాలను ఈ సమావేశాల్లో చర్చించేవారు. బ్రిటిష్‌ పాలకులు ఈ పర్వతంపై ఒక స్థూపాన్ని, విడిది భవనాన్ని కూడా నిర్మించారు. ఇవి శిథిలమైనప్పటికీ.. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలేఉన్నాయి.  మన్యంలో ఎత్తైన ప్రదేశంగా పేరు గాంచిన ఎండ్రిక పర్వతం సుమారు 50 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ రోజుల్లో ఆంగ్లేయులు ఏనుగులు, గుర్రాలు వినియోగించి ఈ పర్వతం ఎక్కి.. సమావేశాలు నిర్వహించేవారట. బ్రిటిష్‌ వారి హయాంలోనే ఇక్కడ రకరకాల పండ్ల తోటల పెంపకం చేపట్టేవారు. ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో బత్తాయి, మామిడి, నిమ్మ, జామ, ఉసిరి వంటి పండ్ల తోటలున్నాయి. ఆయుర్వేద వైద్యానికి ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా ఉన్నట్టు మన్యం ప్రజలు చెబుతారు.  
పర్వతంపై ఊట చెరువు 
ఎండ్రిక పర్వతంపై ఓ ఊట చెరువు ఉంది. ఇందులో ఏడాది పొడవున నీరు ఉంటుంది. దీన్ని ఆధారంగా మూడు కొండ గెడ్డలు ఏర్పడ్డాయి. పెదబయలు మండలంలోని అరడకోట వైపు ప్రవహించే బొంగదారి గెడ్డ, లక్ష్మీపేట వైపు ప్రవహించే రెయ్యిలగెడ్డ, కిముడుపల్లి వైపు ప్రవహించే గేదె గెడ్డకు ఈ ఊట చెరువే ఆధారం. గతంలో ఈ పర్వతం ఎత్తు, పరిసరాలపై పురావస్తు శాఖ పరిశోధనలు నిర్వహించింది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించింది. కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు.