ఎంఆర్‌పల్లి ఎస్‌ఐపై చర్యలు తీసుకోండి

బడుగులపై చేయిచేసుకోవడమే కాకుండా తీవ్ర దుర్భాషలాడిన ఎంఆర్‌పల్లి ఎస్‌ఐ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని తుమ్మలగుంటకు చెందిన బ్రహ్మానందరెడ్డి డిమాండ్‌ చేశారు. తన అక్క ఆదిలక్ష్మి పేరూరు పంచాయతీ స్టాఫ్‌ క్వార్టర్స్‌ సమీపంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ నడుపుతోందన్నారు. కింద దుకాణం, పైన నివాసం ఉంటున్నారని పేర్కొన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం తయారు చేసుకుంటుండగా ఎంఆర్‌పల్లి ఎస్‌ఐ నరేంద్ర వచ్చి షాపును మూసివేయాలని చేయిచేసుకున్నాడని బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు.
తినేందుకు వంట చేసుకుంటున్నట్లు మహిళలు చెబుతున్నా పట్టించుకోకుండా తీవ్ర దుర్భాషలాడినట్లు వాపోయారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు పెడతామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఎస్‌ఐ నరేంద్రపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఎస్‌ఐ నరేంద్రను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.