పాముల కాలం.. జర భద్రం

అసలే వానాకాలం ఆపై పాముల భయం.. వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామాల్లో, తండాల్లో మంత్రాలు చేసేవారిని, చెట్ల మందును నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు.  జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు గాదెలు, గడ్డివాములు మొదలైనవి ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి.
తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి మధ్యలో పాములు తేళ్లు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాల్లో పిడకలు దొంతరలుగా పేర్చి పెడతారు. వాటి మధ్య కూడా విష జంతువులు ఉండే ప్రమాదముంది. చేల గట్ల మీద నడిచే సమయంలో కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. కర్ర చప్పుల్లతో పాముకాటు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
పాములన్నీ విషసర్పాలు కావు.. 
పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు, కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతులతోనే ప్రమాదం ఉంటుంది. అన్ని పాము కాట్లు ప్రమాద కరమైనవికావు. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషంలేని, ప్రమాదం లేని మామూలు గాయాలే డ్రైబైట్స్‌ సాధారణ చికిత్స తీసుకుంటే ఈ గాయాలు నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తోనే ప్రాణం మీది తెచ్చుకుంటారు.