లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్‌ క్వార్టర్‌లో రెట్టింపునకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.249 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.543 కోట్లకు పెరిగింది. లాక్‌డౌన్‌ సమయంలో బిస్కెట్లకు డిమాండ్‌ పెరగడం, వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు చేరడం కూడా ఈ కంపెనీ అమ్మకాలకు కలసివచ్చిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.2,768 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,514 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. అన్ని అంశాల్లోనూ ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి.