మ‌త్స్య‌కార కుటుంబాల సాంఘిక బ‌హిష్క‌ర‌ణ


  • మ‌త్స్యకార కుటుంబాల‌ను సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేసిన దారుణ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో చోటుచేసుకుంది. బహిష్కరించిన 38 కుటుంబాల‌కు ఎవ‌రైనా సాయం చేస్తే వారికి కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని గ్రామాభివృద్ధి క‌మిటీ హుకూం జారీ చేసింద‌ని బాధితులు తెలిపారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌, జిల్లా కలెక్టర్ లకు మత్స్యకారులు ఫిర్యాదు చేశారు. త‌మ‌కు క‌నీసం పాలు వంటి నిత్యావ‌స‌రాలు కూడా అందివ్వ‌డం లేద‌ని, వ్య‌వ‌సాయ ప‌నులకు కూడా పిలవొద్దంటూ క‌మిటీ స‌భ్యులు ఆదేశాలు జారీ చేశార‌ని మ‌త్స్యకారులు వాపోయారు.ప్ర‌భుత్వం ఉచితంగా చేప పిల్లలు ఇస్తుంది కాబ‌ట్టి గ్రామానికి ప్ర‌తి ఏటా ల‌క్ష రూపాయాలు చెల్లించి గ్రామంలో తాము నిర్ణ‌యించిన ధ‌ర‌కే చేప‌లు అమ్మాల‌ని హుకుం జారీ చేసిన‌ట్లు పేర్కొన్నారు. దీనికి తాము ఒప్పుకోక‌పోవ‌డంతో క‌క్ష క‌ట్టి సాంఘిక బ‌హిష్క‌ర‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారని మత్స్యకారులు వాపోయారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో తీవ్ర ఇబ్బందులు, మాన‌సిక క్షోభ‌కు గుర‌వుతున్నామ‌ని మ‌త్స్యకార కుటుంబాలు ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌జాప్ర‌తినిధులైనా త‌మ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని కోరారు.