
ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులను సైతం నర్సింగ్ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోవిడ్ కేసుల భయంతో ఇప్పటికే ఉన్నవారు చెప్పపెట్టకుండా విధులకు గైర్హాజరవుతుంటే.. విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చి.. ఇక్కడి ఆస్పత్రుల్లో చేరిన నర్సులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒకవైపు వెంటాడుతున్న వైరస్ భయం.. మరోవైపు విరామం లేని విధులు.. వారిని తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాదు వీరిలో చాలా మందికి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు. వీరి నుంచి పిల్లకు వైరస్ సోకుతుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము విధులకు హాజరు కాలేమని, తమ సర్టిఫికెట్లు తమకు ఇచ్చేస్తే.. సొంతూరికి వెళ్లిపోతామని చెబుతున్నారు. దీనికి ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. అంతేకాదు ఇష్టం లేకపోయినా వారితో బలవంతంగా కోవిడ్ వార్డుల్లో విధులు కేటాయిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మెహిదీపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఇదే అంశంపై నర్సులు ఆందోళనకు దిగడమే కాకుండా ఆస్పత్రి యాజమాన్యం తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పేర్కొంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం.
కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడి..
నగరంపై ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నిష్పత్తికి తగినన్పి పడకలు లేకపోవడం, ఉన్నవాటిలోనూ సరైన వైద్యసేవలు అందకపోవడంతో చాలామంది బాధితులు ఆర్థికంగా భారమే అయినప్పటికీ.. కార్పొరేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులే కాదు...కార్పొరేట్ ఆస్పత్రుల్లోని అత్యవసర విభాగాలన్నీ కోవిడ్ కేసులు నిండిపోయాయి. స్పెషాలిటీ వెద్యులు రోగిని పరీక్షించి కేవలం మందులు మాత్రమే సూచిస్తారు. ఆ తర్వాత రోగి సంరక్షణ బాధ్యత అంతా ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సులే చూసుకోవాలి. ఎక్కువ సమయం కోవిడ్ వార్డుల్లో గడపాల్సి వస్తుండటంతో వా రు త్వరగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆ విభాగాల్లో సేవలకు ఇతర వైద్య సిబ్బంది అంతా భయçప³డుతున్నారు. ఇదే సమయంలో ఆయా నర్సులపై వారి కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వహించడంతో వారి నుంచి ఇంట్లో వారికి వైరస్ సోకుతుందో అనే భయంతో ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు పొంచి ఉన్న వైరస్ ముప్పు.. మరోవైపు కుటుంబ సభ్యుల ఒత్తిడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.