చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ వర్తింపు

వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదని.. అలా జరగకూడదనే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా పలు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్‌ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.  
నాడు అరకొర సేవలు.. రూ.680 కోట్లు బకాయిలు 
ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని.. దీని పరిధిని విస్తృతంగా పెంచుకుంటూపోతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకంలో కేవలం 1,059 వైద్య సేవలు మాత్రమే అందేవని, అవి కూడా అరకొరగానే ఉండేవని సీఎం వివరించారు. అలాగే, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.680 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని.. తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ చెల్లించేశామన్నారు. ఇంకా ఆయా ఆస్పత్రుల ద్వారా మెరుగైన సేవలందేలా చర్యలు చేపట్టామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. పేదలు గర్వంగా తలెత్తుకుని చికిత్స చేయించుకుని, సంపూర్ణారోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. డాక్టర్లు, ఆసుపత్రులు పేదలను చిన్నచూపు చూడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులన్నీ గ్రీన్‌ ఛానల్‌లో అందజేస్తున్నామని సీఎం చెప్పారు.  
మరిన్ని వైద్య సేవలు..
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్‌ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్‌ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. అంతేకాక.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్‌ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్‌ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.