యువ క్రికెటర్‌పై రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ కాజీ అనిక్‌ ఇస్లామ్‌పై రెండేళ్ల నిషేధం పడింది. డోప్‌ టెస్టులు విఫలం కావడంతో అతనిపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జాతీయ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో నిర్వహించిన డోప్‌ టెస్టులో విఫలం కావడంతో అతనిపై ఎట్టకేలకు నిషేధం పడింది. రెండేళ్ల క్రితం జరిగిన అండర్‌-19 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచిన కాజీ ఇస్లామ్‌.. అదే ఏడాది నిర్వహించిన డోప్‌ టెస్టులో విఫలయ్యాడు. నిషేధిత ఉత్రేరకం మెథామ్‌ఫిటామైన్‌ను కాజీ  తీసుకున్నట్లు రుజువు కావడంతో నిషేధం తప్పలేదు.కాగా, ఆ నిషేధం 2019 ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని తాజాగా బీసీబీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ఆ ఉత్ప్రేరకాన్ని తీసుకుని తప్పు చేసినట్లు కాజీ అనిక్‌ బోర్డు పెద్దల ముందు అంగీకరించినట్లు బీసీబీ తెలిపింది. అయితే కావాలని కాజీ చేయలేదని భావించిన బీసీబీ.. అతనిపై రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్లు పేర్కొంది. ఎటువంటి విచారణ లేకుండా కాజీ తన తప్పును ఒప్పుకోవడంతో సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేశాడని, దాంతో అతనిపై రెండేళ్ల నిషేధం సరైనది భావించినట్లు బీసీబీ ప్రకటనలో వెల్లడించింది. కాజీ తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు తీశాడు.