బుద్ధి వికాసానికి ‘లాక్‌’డౌన్‌

పాపం పుణ్యం.. ప్రపంచమార్గం.. కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు. ఏమీ ఎరగని పూవులు వారు. అయిదారేడుల పాపలు వారు. వాన కురిస్తే.. మెరుపు మెరిస్తే..ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకోసమేననిఆనందించే అమాయకులు వారు. పదుల ప్రాయం నిండినా అభమూ శుభమూ తెలియని పసివాళ్లే వారు. నిన్నటికి, నేటికి, రేపటికి తేడా తెలుసుకోలేని దయనీయ పరిస్థితి వారిది. రాత్రీ పగలూ, దిక్కులు, వారాలు, తేదీల లెక్కలు ఎరగరు వారు. తామెక్కడున్నామో. ఎలా ఉన్నామో కూడా తెలుసుకోలేని అభాగ్యులు వారు. మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లలు. ఎంత వయసొచ్చినాఇంకా తల్లిచాటు బిడ్డలే వారు. బుద్ధిమాంద్యంతోనేబాధపడుతున్న వీరికి లాక్‌డౌన్‌ మరింత కఠిన శిక్షవిధించింది. అమ్మఒడి లాంటి శిక్షణ సంస్థలకు దూరంచేసింది. కరోనా కట్టడి కోసం  విధించిన లాక్‌డౌన్‌సడలింపుతో కొన్ని రంగాల్లో మినహాఅంతటా సాధారణ జనజీవనం నెలకొంది.
విద్యాసంస్థలు తెరుచుకోకపోయినా ఆన్‌లైన్‌లో పిల్లలకు పాఠాలను బోధిస్తున్నారు. కానీ మానసిక వికలాంగులైన పిల్లలకు మాత్రం లాక్‌డౌన్‌ శాపంగా మారింది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 88 సంస్థలు బుద్ధిమాంద్యత పిల్లలకు శిక్షణనిస్తున్నాయి. వీటిలో సుమారు 5 వేల మంది పిల్లలు ట్రెయినింగ్‌ పొందుతున్నారు. ప్రస్తుతం ఆయా సంస్థలన్నీ మూసివేసి ఉన్నాయి. ప్రతి క్షణం నిపుణులైన టీచర్లు, వలంటీర్ల పర్యవేక్షణలో దైనందిన జీవితాన్ని కొనసాగించే బుద్ధిమాంద్యత పిల్లలు కోవిడ్‌ కారణంగా మూడున్నర నెలలుగా ఇళ్లకే పరిమితమయ్యారు. తల్లిదండ్రుల ఆదరణ, పోషణ ఉన్నప్పటికీ..  శాస్త్రీయమైన పద్ధతిలో పిల్లలకు మార్గనిర్దేశం చేసే వ్యవస్థ అందుబాటులో లేకుండాపోయింది. దీంతో ‘ప్రత్యేకమైన పరిస్థితులు’ కలిగిన ఆ పిల్లల మనుగడ తీవ్రమైన ఇబ్బందులనెదుర్కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ పిల్లలే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు అవకాశం లేక ఇళ్లల్లో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతుండగా బుద్ధిమాంద్యులైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితులు  మరికొంత కాలం ఇలాగే కొనసాగితే వీరి పెంపకం తల్లిదండ్రులకు కూడా భారంగా మారే అవకాశముందని పేర్కొంటున్నారు.