ఆర్డర్లలో అగ్రస్థానం బిర్యానీదే..

లాక్‌డౌన్‌ కాలంలోనూ మనోళ్లు తెగ లాగించేశారు. దేశంలోని తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని భోజనప్రియులు సంతృప్తిపరుచుకున్నారు. వాటిలో అగ్రస్థానం బిర్యానీకే దక్కింది. కోవిడ్‌ వ్యాప్తి కారణం గా విధించిన లాక్‌డౌన్‌ కాలంలో కేవలం బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయట. బట్టర్‌ నాన్‌లు, మసాలా దోశలను మూడున్నర లక్షల మార్లు భోజనప్రియులు తెప్పించుకున్నారు. మూడున్నర లక్షల ‘రెడీటు కుక్‌ ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌ ప్యాకెట్స్‌’డెలివరీ అయ్యాయి. చాక్‌లెట్‌ లావా కేక్‌ను 1.3 లక్షల సార్లు, గులాబ్‌ జామూన్‌ ను 85 వేల పర్యాయాలు, మౌస్సె కేక్‌ను 28 వేల మార్లు ఆర్డర్‌ చేశారు.
కరోనా వ్యాప్తి నిరోధకం దృష్ట్యా మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు వ్యక్తు ల మధ్య దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పుట్టినరోజు, పెళ్లిరోజుల వేడుకలు తగ్గిపోయాయి.  పలు వురు పుట్టినరోజు వే డుకలను వీడియో కాల్స్, ఆన్‌లైన్‌లో వర్చువల్‌ కేక్‌ కటింగ్‌ సెష న్స్‌ ద్వారా జరుపుకున్నారట. ఇలా లాక్‌డౌన్‌ కాలం లో 1.2 లక్షల కేక్‌లు డోర్‌ డెలి వరీ అయ్యాయి.ఇక భారతీయులు తమకిష్టమైన ఏయే ఆహారపదార్ధాలను, ఎన్నిసార్లు తెప్పించుకున్నారన్న దానిపై ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ‘‘స్టాట్‌‘ఈట్‌’ఇస్టిక్స్‌ రిపోర్ట్‌.. ది క్వారంటైన్‌ ఎడిషన్‌’’ పేరిట తన తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్‌ చేసిన ఆహారపదార్థాల్లో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచినట్టు ఈ సంస్థ తెలిపింది.
మొత్తం 4 కోట్ల ఆర్డర్ల డెలివరీ..: భారత్‌లో దాదాపు రెండున్నర నెలల పాటు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ కాలంలో ఫుడ్, సరుకులు, మెడిసిన్స్,ఇతర వస్తువులు కలిపి 4 కోట్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇవేకాకుండా 73 వేల శానిటైజర్, హాండ్‌ వాష్‌ బాటిళ్లు, 47 వేల ఫేస్‌మాస్క్‌లు కూడా ఇళ్లకు చేరవేసింది. లాక్‌డౌన్‌లో రోజూ రాత్రి 8 గంటలకు సగటున 65 వేల వంతున ‘మీల్‌ ఆర్డర్లు’వచ్చేవని పేర్కొంది.