శిఖర్‌ ధావన్‌తో ఐఎంజీ రిలయన్స్‌ ఒప్పందం

భారత సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐఎంజీ రిలయన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అతని మార్కెటింగ్‌ వ్యవహారాలన్నీ ఇకనుంచి ఐఎంజీ చూస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్పాన్సర్‌షిప్, ఎండార్స్‌మెంట్, ప్రమోషనల్‌ కార్యక్రమాలు, ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వూ్యలన్నీ ఐఎంజీ రిలయన్స్‌ కంపెనీ చక్కబెడుతుంది. ‘మేటి మేనేజ్‌మెంట్‌ కంపెనీతో జతకట్టడం చాలా ఆనందంగా ఉంది.
మైదానంలో నేను నా ఆటను చూసుకుంటే నా మార్కెటింగ్‌ అంశాల్ని ఇప్పుడు ఐఎంజీ చూసుకుంటుంది. ఇది నా ప్రతిభకు గరిష్ట ప్రయోజనాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది’ అని ధావన్‌ ఒక ప్రకటనలో తెలిపాడు. ధావన్‌లాంటి స్టార్‌ క్రికెటర్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తమ కంపెనీ బ్రాండ్‌ విలువను పెంచుతుందని ఐఎంజీ రిలయన్స్‌ హెడ్‌ నిఖిల్‌ బర్దియా తెలిపారు. ఈ కంపెనీతో ఇప్పటికే రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్, కృనాల్‌ పాండ్యా సోదరులు, శ్రేయస్‌ అయ్యర్‌ జతకట్టారు.