‘కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరం’

హరితహారంలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రామ్‌నగర్‌లోని హాస్పిటల్ ఆవరణంతో పాటు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు చోట్ల సోమవారం మొక్కలు నాటారు. అనంతరం మేయర్ సునీల్ రావుతో కలిసి డివిజన్లోని ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత మొగ్దుంపూర్లో కలెక్టర్ శశాంక్‌తో కలిసి ఎకరం ప్రభుత్వ స్థలంలో మంకీ ఫుడ్ కోర్టుకు శ్రీకారం చుట్టి.. పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. అందుచేత అడవి లేని కరీంనగర్‌ జిల్లాలో 50 లక్షల మొక్కలు సెప్టెంబర్ చివరి వరకు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అడవులు లేని జిల్లాగా ఉన్న కరీంనగర్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ముమ్మరంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే కరీంనగర్ జిల్లా మళ్లీ అడవులకు నిలయంగా మారుతుందన్నారు. నగరంలో 10 నుంచి 12 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని, నగర ప్రజలకు కావలసిన పండ్లు, పూల మొక్కలు ఇంటికి ఆరు ఉచితంగా పంపిణీ చేస్తుననామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించితే బావి తరాలకు భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతామని మంత్రి వ్యాఖ్చానించారు.