వైరస్‌ కట్టడికి మంత్రి ఈటల జిల్లాల పర్యటన షురూ

కరోనా సామాజిక వ్యాప్తి జరగడంతో ప్రభుత్వం కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగా పరీక్షలు, చికిత్సలు జరగ్గా, ఇకనుంచి జిల్లా ల్లోనూ వాటిని నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆసుపత్రి వరకు జ్వర బాధితుల గుర్తింపు, తక్షణ చికిత్స, పరీక్షలు, ఒకవేళ సీరియస్‌ అయితే ఆసుపత్రుల్లో చేర్పించ డంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జిల్లాల్లో వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని కదిలిం చేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నడుం బిగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే మొదటగా ఆదివారం ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష నిర్వహించారు. అక్కడ జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడంపై ఆయన జిల్లా పర్యటనలు కొనసాగనున్నాయి.
మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఆరా
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54 వేలు దాటింది. 463 మంది చనిపోయారు. పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవు తోంది. సామాజిక వ్యాప్తి జరగడంతో వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి ఉంటుందని స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మున్ముందు మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని సర్కారే హెచ్చరించింది. పైగా ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేంద్రీకృతమైన కేసుల సంఖ్య జిల్లాలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. అందువల్ల జిల్లాల్లోని అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.