ప్రతి ఆదివారం శుభ్రతకు పది నిమిషాలు

 ‘ఏం అమ్మా.. బాగున్నారా.. ఇయ్యాళ ఆదివారం కదా.. ఏం తీసుకొచ్చిర్రు.. మటనా, చికెనా.. ఆదివారం వచ్చిందంటే చాలు నోరు గుంజుకుపోతది కదా.. అట్లే ప్రతి ఆదివారం మీరంతా ఒక్క పది నిమిషాలు మీ కోసం సమయాన్ని కేటాయించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోండి. వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  కరోనా కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి’అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఉదయం సిద్దిపేటలో డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్, ఎన్టీఆర్‌ నగర్, ఇస్లాంనగర్‌ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పారిశుధ్య చర్యలు, పరిసరాల శుభ్రం, కరోనా పట్ల ప్రజల్లో అవగాహన గురించి మహిళలకు వివరించారు.  
పది నిమిషాలు డ్రైడే..
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పది నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ డ్రైడేలో భాగంగా ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని మంత్రి హరీశ్‌ సూచించారు. డ్రైడేలో ఆయా  కౌన్సిలర్‌ ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలంతా సామాజిక బాధ్యతగా డ్రైడేలో పాల్గొనాలని కోరారు. ప్రపంచం మొత్తం కరోనా ఉందని, దాన్ని చూసి భయాందోళనకు గురి కావొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.