టచ్‌ చేసి చూడకు

వైట్‌ హౌస్‌లోని గులాబీల తోట అమెరికా అధ్యక్షుడి ప్రెస్‌మీట్‌లకు అనువైన ప్రదేశం. ఇంటికి దగ్గరే ఆఫీస్‌ ఉన్నంత సౌకర్యంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడేవారికి, వినేవారికి శ్రమ తెలియదు. డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఆ గులాబీల తోటలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. చైనాపై విధించిన ఆంక్షల గురించి చెబుతున్నారు. ఎన్నికల ర్యాలీ కాదు కనుక సౌమ్యంగా ఉంది ఆయన మాటతీరు. అయితే గులాబీ పూల వెనుక ఉండే ముళ్లలా ఆయన ప్రసంగంలోని రెండు మాటలు వెళ్లి అలెగ్జాండ్రియా ఒకాసియా కార్టెజ్‌కు గుచ్చుకున్నాయి. యు.ఎస్‌. కాంగ్రెస్‌ ఉమన్‌ ఆమె. డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఆమెరికన్‌ల సంక్షేమం కోసం గట్టిగా మాట్లాడే ఒక గొంతు. 2018 మిడ్‌–టెర్మ్‌ ఎన్నికల్లో న్యూయార్క్‌ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆమె వయసు 28 ఏళ్లు. అమెరికన్‌ కాంగ్రెస్‌ చరిత్రలోనే సభలోకి వెళ్లిన అతిచిన్న వయసు మహిళ. ఆమెను.. తటాలున మాట అనేశారు ట్రంప్‌.
నవంబర్‌ 3న జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడన్‌తో కలిసి పనిచే స్తున్నారు అలెగ్జాండ్రియా. ప్రెస్‌ మీట్‌లో చైనా గురించి మాట్లాడుతున్న ట్రంప్‌ మెల్లిగా బైడన్‌ మీదకు మళ్లారు. బైడన్‌ హామీ ఇస్తున్న విధానాలను వేళాకోళం చేశారు. రెండు ట్రిలియన్‌ డాలర్ల ఖర్చయ్యే బైడన్‌ ‘గ్రీన్‌ న్యూ డీల్‌’ క్లయిమేట్‌ పాలసీని అర్థంలేనిదిగా తీసిపారేశారు. ఆ గ్రీన్‌ న్యూ డీల్‌ను తయారు చేసింది, ఆ డీల్‌కు ఇన్‌చార్జిగా ఉన్నదీ అలెగ్జాండ్రియా. ‘‘ఆయన్ని చూడండి, అలెంగ్జాండ్రియా అనే యంగ్‌ ఉమన్‌ని తెచ్చిపెట్టుకున్నాడు. జోక్‌లా అనిపిస్తోంది నాకు. అనేక విధాలుగా ఆమె.. నాట్‌ ట్యాలెంటెడ్‌..’’ అన్నారు ట్రంప్‌! ట్రంప్‌తో గానీ, వైట్‌ హౌస్‌ ప్రెస్‌ మీట్‌తో గానీ, చైనాతో గానీ ఆమెకు ఏ సంబంధమూ లేదు. ట్రంపే ఆమె జోలికి వెళ్లాడు. నిప్పునే కాదు, ట్యాలెంట్‌ను టచ్‌ చేసినా చుర్రుమని కాలుతుంది. 
కొన్ని గంటల్లోనే ట్రంప్‌కు అలెగ్జాండ్రియా నుంచి గట్టి సమాధానం వచ్చింది. మునుపు కూడా ట్రంప్‌.. మహిళల ప్రతిభా ప్రావీణ్యాలను తేలిగ్గా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పేరు పెట్టి నేరుగా తననే తక్కువ చేసి మాట్లాడారు! ఈసారి ఊరుకోలేదు అలెగ్జాండ్రియా. ‘‘జీవితమంతా తండ్రి డబ్బు మీద ఎదిగిన వ్యక్తి, ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తి.. ముప్పై ఏళ్ల వయసుకే యు.ఎస్‌. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఒక హౌస్‌ క్లీనర్‌ కూతుర్ని ‘నాట్‌ ట్యాలెంటెడ్‌’ అంటున్నారు. రోజ్‌ గార్డెన్‌లో ఆయన ప్రసంగం వింటే ఆయన కూడా ఈ సంగతి నమ్మలేకపోతున్నాడని అర్థమౌతోంది’’ అని ట్వీట్‌ చేశారు అలెగ్జాండ్రియా. ట్రంప్‌ ఆమెను నాట్‌ ట్యాలెంటెడ్‌ అని అకారణ దూషణ చేశారు కానీ, ట్రంప్‌కి ఆమె లేనిపోనివేమీ ఆపాదించి విమర్శించలేదు. గత ఏడాది ‘ప్రోపబ్లికా’ అనే పరిశోధనాత్మక వార్తా పత్రిక మన్‌హట్టన్‌లో ట్రంప్‌ నడిపిన వ్యాపారాల పన్ను చెల్లింపు డాక్యుమెంట్‌లలోని అవకతవకల్ని వెలికితీసింది.