17 శాతం దూసుకెళ్లిన రెడింగ్టన్‌ ఇండియా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర  ఫలితాలు ప్రకటించినప్పటికీ ఐటీ ప్రొడక్టుల పంపిణీ దిగ్గజం రెడింగ్టన్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఫలితాలు అంచనాలను చేరడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ సిటీ యూనియన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
రెడింగ్టన్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో రెడింగ్టన్‌ ఇండియా నికర లాభం 19 శాతం క్షీణించి రూ. 89 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం నీరసించి రూ. 10,722 కోట్లకు చేరింది. ఇబిటా 6 శాతం వెనకడుగుతో రూ. 230 కోట్లను తాకింది. అయితే కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ల అమలు నేపథ్యంలోనూ కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించగలిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెడింగ్టన్‌ ఇండియా షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 17 శాతం దూసుకెళ్లి రూ.  110 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 112 వరకూ ఎగసింది.
సిటీ యూనియన్ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో సిటీ యూనియన్ బ్యాంక్‌ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 154 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 1210 కోట్లను తాకింది. అయితే స్థూల మొండిబకాయిలు 4.09 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. ఇక నికర ఎన్‌పీఏలు సైతం 2.29 శాతం నుంచి  2.11 శాతానికి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 123 వద్ద ట్రేడవుతోంది.