సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌

గత పుష్కరకాలంగా ఐపీఎల్‌ నిరాటంకంగా జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరిగినా... పుట్టింట్లో నిర్వహించినా... విజేత మాత్రం ‘సూపర్‌ సండే’లోనే తేలింది. కానీ ఈసారి ఆనవాయితీ మారింది. ఫైనల్‌ ఆదివారం కాకుండా మంగళవారం నిర్వహించనున్నారు. లీగ్‌ చరిత్రలో తొలిసారి ఈ మార్పు చోటుచేసుకుంది. ఆదివారం ఎక్కడివారక్కడే ఉండి వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఐపీఎల్‌ పాలకమండలి (గవర్నింగ్‌ కౌన్సిల్‌–జీసీ) సమావేశంలో ఆట కోసం మూడు వేదికల్ని, గరిష్టంగా యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను ఖరారు చేశారు. దుబాయ్, అబుదాబి, షార్జా స్టేడియాల్లో 53 రోజుల పాటు మెరుపుల టి20లు జరుగుతాయి.
24 మంది ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీలు అక్కడికి ఈ నెలలోనే బయల్దేరతాయి. ముందుగా అన్నట్లు నవంబర్‌ 8న కాకుండా నవంబర్‌ 10న ఫైనల్‌ నిర్వహిస్తారు. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా డ్రాగన్‌ స్పాన్సర్‌షిప్‌పై వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ఈ సీజన్‌లో పాత స్పాన్సర్లనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ‘వివో ఐపీఎల్‌–2020’కి సంబంధించిన కీలక నిర్ణయాలను జీసీ వెలువరించింది. యూఏఈలో ఐపీఎల్‌ టోర్నీ నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి లభించిందని ఆదివారం రాత్రి వార్తలు వచ్చినా... బీసీసీఐ మాత్రం ఇంకా అనుమతి రాలేదని... ఈ వారంలో గ్రీన్‌ సిగ్నల్‌ లభించే అవకాశముందని తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.