క్యూ1 ఫలితాల ప్రభావం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మొబైల్‌ మార్కెటింగ్‌ కంపెనీ అఫ్లే ఇండియా లిమిటెడ్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మరోపక్క ఇదే కాలంలో పీఎస్‌యూ దిగ్గజం కంటెయినర్‌ కార్పొరేషన్‌(కంకార్‌) లిమిటెడ్‌ నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించింది. దీంతో అఫ్లే ఇండియా కౌంటర్‌లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూకట్టగా.. కంకార్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అఫ్లే ఇండియా అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా..  నవరత్న కంపెనీ కంకార్‌ భారీ నష్టాలతో కుప్పకూలింది.  వివరాలు చూద్దాం..
అఫ్లే ఇండియా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో అఫ్లే ఇండియా నికర లాభం 42 శాతం పెరిగి రూ. 19 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం బలపడి రూ. 90 కోట్లను తాకింది. ఇబిటా 20 శాతం వృద్ధితో రూ. 22 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో అఫ్లే ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం10 శాతం దూసుకెళ్లింది. అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 2026 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత 4 నెలల్లో ఈ షేరు 81 శాతం ర్యాలీ చేయడం విశేషం!
కంటెయినర్‌ కార్పొరేషన్
కార్గొ టెర్మినల్స్‌ నిర్వాహక దిగ్గజం కంటెయినర్‌ కార్పొరేషన్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో  76 శాతం పడిపోయింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 58 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1723 కోట్ల నుంచి రూ. 1252 కోట్లకు క్షీణించింది. ఇబిటా మార్జిన్లు 24.6 శాతం నుంచి 13.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో కంకార్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 15 శాతం కుప్పకూలింది. రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 366 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.