క్యూ1లో నిరుత్సాహకర ఫలితాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో ఫలితాలు నిరాశపరచినప్పటికీ ఎలక్ట్రిక్‌ అప్లయెన్సెస్‌ తయారీ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌) కాలంలో పటిష్ట పనితీరు చూపిన మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
బటర్‌ఫ్లై గంధిమతి అప్లయెన్సెస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో  బటర్‌ఫ్లై గంధిమతి రూ. 8.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 2.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు సైతం 50 శాతం క్షీణించి రూ. 77 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బటర్‌ఫ్లై గంధిమతి షేరు  ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 152 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 157 వరకూ ఎగసింది.
కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 47 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 522 కోట్లను అధిగమించింది. పన్నుకుముందు లాభం 5 శాతం బలపడి రూ. 59 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 242ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 238 వద్ద ట్రేడవుతోంది.