214 పాయింట్ల లాభంతో 38,435కు సెన్సెక్స్‌

బ్యాంక్, విద్యుత్‌ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. ప్రపంచ మార్కెట్లు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు పెరిగి 74.84కు చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం....  సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 359 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్‌ చివరకు 214 పాయింట్ల లాభంతో 38,435 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 11,372 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 557 పాయింట్లు, నిఫ్టీ 193 పాయింట్ల చొప్పున పెరిగాయి.   
లాభాల్లో ఆసియా మార్కెట్లు....
అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చల్లారకున్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా, ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. టెక్నాలజీ షేర్లతో అమెరికా సూచీలు  గురువారం లాభపడటంతో శుక్రవారం ఆసియా  మార్కెట్లు 1 శాతం మేర లాభపడ్డాయి. యూరప్‌ మార్కెట్లు లాభాల్లో మొదలై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
► ఎన్‌టీపీసీ షేరు 5 శాతం లాభంతో రూ.106 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► వచ్చే నెల 25 నుంచి నిఫ్టీ50 సూచీలో చేర్చనుండటంతో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 1–5 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్, జీ  ఎంటర్‌టైన్మెంట్‌ షేర్ల స్థానంలో ఈ రెండు షేర్లను చేరుస్తున్నారు.  
► బోనస్‌ షేర్ల వార్తల కారణంగా ఆర్తి డ్రగ్స్‌ షేర్‌ రెండో రోజూ కూడా ఎగసింది.  శుక్రవారం మరో 10 శాతం లాభపడి ఆల్‌టైమ్‌ హై, రూ.3,122  వద్ద ముగిసింది.
► విద్యుత్తు  షేర్ల లాభాలు రెండో రోజు కూడా కొనసాగాయి.  
► నిధుల సమీకరణ వార్తల కారణంగా వా టెక్‌ వాబాగ్‌ షేర్‌ 19 శాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది.