జూలైలో 23.64 బిలియన్‌ డాలర్లకు పరిమితం

కరోనా కారణంగా ఎగుమతులు క్షీణించాయి. జూలైలో 23.64 బిలియన్‌ డాలర్ల (రూ.1.77 లక్షల కోట్లు) ఎగుమతులు సాధ్యమయ్యాయి. ప్రధానంగా పెట్రోలియం, తోలు, రత్నాలు, జ్యుయలరీ ఎగుమతులు పడిపోయాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ (లాక్‌ డౌన్‌ లు ఎక్కువగా అమలైన కాలం) నెలలతో పోలిస్తే జూలైలో ఎగుమతుల క్షీణత తగ్గిందనే చెప్పుకోవాలి. ఏప్రిల్‌ లో ఎగుమతులు ఏకంగా అంతక్రితం ఏడాది అదే నెలతో పోలిస్తే 60 శాతం పడిపోగా, మే నెలలోనూ 37 శాతం, జూన్‌ లో 12.41 శాతం మేర తగ్గాయి.
కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత్‌ తో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలు కూడా సతమతమవుతుండడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది.  ఇక జూలై నెలలో దిగుమతులు సైతం 28 శాతం మేర తగ్గి 28.47(రూ.2.17లక్షల కోట్లు) బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులతో పోలిస్తే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడం) 4.83 బిలియన్‌ డాలర్లు(రూ.36,225కోట్లు)గా నమోదైంది. గతేడాది జూలై నాటికి ఉన్న వాణిజ్య లోటు 13.43 బిలియన్‌ డాలర్ల (రూ.లక్ష కోట్లు)తో పోలిస్తే ఈ ఏడాది తక్కువగానే ఉండడం కాస్త ఊరటగానే చెప్పుకోవాలి. 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూన్‌ లో మన దేశం వాణిజ్య పరంగా మిగులును నమోదు చేయడం గమనార్హం.