ఏజీఆర్‌ కేసు విచారణ 24కు వాయిదా

టెలికం కంపెనీలకు సంబంధించి సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్‌) కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన టెలికం కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్‌ పంపిణీ వివరాలను (షేరింగ్‌) ఇవ్వాలని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా టెలికం శాఖను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) రిలయన్స్‌ జియో మధ్య స్పెక్ట్రమ్‌ పంపకం జరగ్గా.. ఆర్‌ కామ్‌ స్పెక్ట్రమ్‌ ను వాడుకున్నందుకు, ఆ కంపెనీ స్పెక్ట్రమ్‌ బకాయిలను జియో ఎందుకు చెల్లించకూడదంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం లోగడ విచారణలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ కామ్‌ తోపాటు, వీడియోకాన్‌ దివాలా చర్యలను ఎదుర్కొంటున్న విషయం గమనార్హం.
‘‘వీడియోకాన్‌ స్పెక్ట్రమ్‌ బదలాయించాలంటే, దాని కంటే ముందు గత బకాయిలను కంపెనీ చెల్లించాలి’’ అంటూ వీడియోకాన్‌ విషయమై ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ వీడియోకాన్‌ చెల్లించకపోతే, ఆ స్పెక్ట్రమ్‌ ను సొంతం చేసుకున్న భారతీ ఎయిర్‌ టెల్‌ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి  వీడియోకాన్‌ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కార్పొరేట్‌ దివాలా చర్యల ప్రక్రియకు వెలుపల తాము ఎటువంటి బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కలిగిలేమని నివేదించారు.