రూ.2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకెలా ఇచ్చారు?

విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు పల్లీల్లా పంచిపెడతారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎకరా రూ.2.5 కోట్లు విలువైన భూమిని రూ.5 లక్షలకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. దర్శక, నిర్మాత ఎన్‌.శంకర్‌కు శంకర్‌పల్లి సమీపంలోని మోకిల్లాలో ఐదెకరాల భూమిని రూ.5 లక్షల చొప్పున కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ జె.శంకర్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. రూ.50 కోట్లతో స్టూడియో నిర్మిస్తున్నారని శంకర్‌ తరఫున న్యాయవాది గోవిందరెడ్డి నివేదించారు. ప్రస్తుతం నిర్మాణం ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా.. భూమిని చదును చేయడంతోపాటు ప్రహరీగోడ నిర్మించామని, ధర్మాసనం ఆదేశాలతో యథాతథ స్థితి కొనసాగిస్తున్నామని తెలిపారు.
‘స్టూడియో నిర్మించి 300 మందికి ఉపాధి కల్పిస్తామని చెబితే ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయిస్తారా? భూముల కేటాయింపులకు సంబంధించి ఒక స్పష్టమైన విధానం ఉండాలి. అక్కడ భూమి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత తక్కువ ధరకు భూమిని కేటాయించడానికి కారణాలేంటి? ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకునేలా ఉండాలి. ఈ భూ కేటాయింపుల్లో ప్రభుత్వ తీరు ఎంత మాత్రం సమర్థనీయంగా లేదు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు సైతం ఒక ప్రాతిపదిక ఉండాలి. భూకేటాయింపులు నిబంధనల మేరకే జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తెలియజేసేందుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో.. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాత«థస్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.