5 నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఒక సీఈ పరిధిలో..

రాష్ట్ర జల వనరుల శాఖ సంపూర్ణ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, ఐడీసీ పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చేలా చేసిన కసరత్తు పూర్తవగా, పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని అసెంబ్లీ వేదికగానే ప్రజా ప్రతినిధులు, ప్రజల ముందుంచాలని సీఎం కె,చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీనిపై అసెంబ్లీలోనే ప్రకటన చేసి, వివరణ ఇవ్వాలనే నిశ్చయానికి వచ్చారు. మంగ ళవారం జల వనరుల శాఖపై సమీక్ష చేసిన సీఎం వివిధ అంశాలపై ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలన్న దానిపై కీలక సూచనలు చేశారు.  
ఇవీ కొత్త నిర్ణయాలు..: ప్రాజెక్టుల పరిధిలో ఉన్న కాల్వలు, పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, ఐడీసీ పథకాలు, చెరువులను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లకు పని విభజన చేయాలని సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) పరిధిలో ప్రస్తుతం 10 నుంచి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, కొందరు సీఈల పరిధిలో 2 నుంచి 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తాజాగా ఒక్కో సీఈ పరిధిలో 5 నుంచి 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేలా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం 13 సీఈ డివిజినల్‌ కార్యాలయాలుండగా, వాటి సంఖ్యను 19కి పెంచనున్నారు. నిజానికి ఇంజనీర్లు 17 డివిజన్లను సూచించినా, సీఎం కొత్తగా కామారెడ్డి, కొత్తగూడెం డివిజన్లను ప్రతిపాదించారు. ఇప్పటికే పంప్‌హౌస్‌ల నిర్వహణకు ఒక ఈఎన్‌సీని ప్రత్యేకంగా నియమించడంతో పాటు బేసిన్ల వారీగా కృష్ణా, గోదావరికి ఒక్కో సీఈని కొత్తగా నియమించే అవకాశాలున్నాయి.