మిల్లుల్లో మూలుగుతున్న 5,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం


ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరగాలి... ప్రతి గింజకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, మిల్లర్లు, అధికారుల వైఫల్యం వల్ల రబీ ధాన్యం బిల్లులు సకాలంలో అందక రైతులు ఆందో ళన చెందుతున్నారు. దీనిపై మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని బిల్లులు చెల్లింపునకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. మిల్లుల్లో ధాన్యం ఉన్నా... రబీలో కొనుగోలు చేసినట్లు అధికారులు చూపుతు న్న ధాన్యం, సీఎంఆర్‌ విషయం పక్కన పెడితే మిల్లుల్లో ఉన్న రైతుల ధాన్యంపై సమస్య తలెత్తింది. జిల్లాలో అనేక మంది రైతులకు చెందిన 5,400 మెట్రిక్‌ టన్నులు ధాన్యం మిల్లుల్లో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వీటిని నమోదు చేసి మిల్లులకు పంపించారు. మిల్లర్లు మాత్రం వాటిని తీసుకున్నట్లు చూపడం లేదు. దీంతో ఆయా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.8.81 కోట్లు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం అక్కడ సిబ్బంది నమోదు చేసి మిల్లుల కు పంపించాలి. మిల్లర్లు వాటిని తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఓకే చేస్తే రైతులకు బిల్లులు రెండు రోజుల్లో పడిపోతాయి. 25 మిల్లుల్లో సమస్య రబీలో కొనుగోలు చేసిన ధాన్యం జిల్లాలోని 77 మిల్లులకు తరలించారు. ఇందులో 52 మిల్లులకు తరలించిన ధాన్యం మిల్లర్లు తీసుకున్నట్టు చూపడంతో బిల్లులు కూడా రైతుల ఖాతాల్లో పడిపోయాయి. కానీ 25 మిల్లులకు తరలించిన 5,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం పెండింగ్‌లోనే ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకున్న చూపడంలేదు. ఆ మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ మేరకు ఇప్పటికే వారికి ధాన్యం ఇచ్చారు. వాటిని మరపట్టి ఇస్తే మిగతా ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంది. అయితే, ఇప్పటికే ఆయా మిల్లర్లు 5వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యానికి సంబంధించి బియ్యం ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఈధాన్యం తీసుకోలేని పరిస్థితి. అయితే, అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇస్తే ఆమేరకు 1:4 నిష్పత్తిలో ధాన్యం తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆపని కూడా మిల్లర్లు చేయడం లేదు. దీంతో ఆ మిల్లులకు చేరినా మిల్లర్లు ఓకే చేయకపోవడంతో బిల్లుల చెల్లింపు జరగని పరిస్థితి తలెత్తింది.