యూఏఈలో ఐపీఎల్‌తో భారీ ఆదాయం కోల్పోనున్న ఫ్రాంచైజీలు

ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్‌... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్‌ రెవిన్యూ షేరింగ్‌ అగ్రిమెంట్‌లో ఫ్రాంచైజీలకు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్‌లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్‌ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్‌ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి.  
మీడియా హక్కులే ఆలంబన...
ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్‌ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్‌ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్‌ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్‌తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్‌కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా.