లాఠీచార్జీ ఘటనను మరువని వంశధార నిర్వాసితులు

వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ నిర్మాణంలో హిరమండలం, కొత్తూరు మండలాల్లో 18 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా వంశధార ఫేజ్‌–2 రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయనపై ఉన్న నమ్మకంతో అప్పట్లో నిర్వాసితులు సైతం తమ భూములు ఇచ్చేందుకు, గ్రామాలను ఖాళీ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ మహానేత ఆకస్మిక మరణంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. ప్యాకేజీ, పరిహారం విషయంలో తీరని అన్యాయం చేసింది.
నిజమైన నిర్వాసితులకు కాకుండా తమ పార్టీ చోటా నేతలకు పెద్దపీట వేసింది. కోట్లాది రూపాయలు ప్యాకేజీ, పరిహారం కోసం మంజూరు చేసినట్టు చెప్పుకొచ్చారు. అదే సమయంలో గ్రామాలను ఖాళీ చేయాలని, పొలాల్లో పంటలు పండించవద్దని హుకుం జారీ చేసింది. ఇంకా సమస్యలు పరిష్కరించలేదని, అంతవరకూ పంటలు పండించుకుంటామని నిర్వాసిత గ్రామాల ప్రజలు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 2017 ఆగస్టు 17న దమ్ములకు సిద్ధమవుతున్న రైతులపై నాటి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు. వందలాది మంది మోహరించడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలిపోయారు. అండగా నిలిచిన గ్రామ ప్రతినిధులపై కేసులు అక్రమంగా బనాయించారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాటి టీడీపీ ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. నిర్వాసితులకు అండగా నిలిచారు.