కరోనాపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన

కరోనా భౌతికదూరాన్ని శాసిస్తే.. కరుణ మానసిక సాన్నిహిత్యాన్ని చాటుతోంది. కోవిడ్‌ మనుషులను విడగొడితే.. మానవత్వం మనుషులను కూడగడుతోంది. పాజిటివ్‌ వచ్చినవారి పట్ల పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కోవిడ్‌ ఆపత్కాలంలో ప్రజల ప్రవర్తనలో మెల్లగా మార్పు గోచరిస్తోంది. కొన్ని నెలల క్రితం కరోనా అనగానే పరిగెట్టేవారు. ఆ వైరస్‌ సోకితే ఇక భూమిపై నూకలు చెల్లినట్టేనని, అది ఎక్కడ తమకు సోకుతుందోనని,ఏమైపోతామోనని భయకంపితులయ్యేవారు. పాజిటివ్‌ వచ్చిందని తెలిస్తే చాలు బాధితులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలివేసినట్టుగా చూసేవారు.
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత రిపోర్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా దూరంగా ఉంచుతూ అనుమానాస్పదంగా చూసేవారు. అయితే ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారి విషయంలో మనుషుల తీరు, వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పాజిటివ్‌ వచ్చినవారి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఏదో ఒక రూపంలో ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా ‘నేనున్నాననీ... నీకేం కాదనీ’అనే విధంగా బం«ధువులు, మిత్రులు, ఇరుగుపొరుగువారు ముందుకు వచ్చి బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. జాగ్రత్తల గురించి చెబుతున్నారు. కరోనా రోగులకు ఇది టానిక్‌గా పనిచేస్తుండడంతో త్వరగా కోలుకుని మళ్లీ మామూలు మనుషులుగా మారడానికి దోహదపడుతున్నారు.