పవర్‌ హౌజ్‌ ప్రమాదంపై సీఐడీ విచారణ

శ్రీశైలం పవర్‌హౌస్ ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సీఐడీ విచారణకు ఆదేశించారు. సీఐడీ అడిషనల్ డీజీ గోవింద్‌ సింగ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. విద్యుత్‌ కేంద్రంలో మొత్తం 9 మంది చిక్కుకుపోగా సీఐఎస్‌ఎఫ్‌ రెస్క్యూ బృందం వారిని రక్షించేందుకు రంగంలోకి దిగింది. అయితే దురదృష్టవశాత్తూ లోపల చిక్కుకుపోయిన వారంతా మృత్యువాతపడ్డారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాదం ఘటనలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాగా, గురువారం రాత్రి 10.35 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు.