ఏజీఆర్‌ కేసులో కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు

టెలికం కంపెనీలు ప్రభుత్వానికి కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల వివాదం కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. వివరాల్లోకి వెడితే.. దివాలా తీసిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) కట్టాల్సిన బాకీలను ఆ కంపెనీ స్పెక్ట్రంను వాడుకుంటున్నందున రిలయన్స్‌ జియో సంస్థ కట్టాలని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జియోకు స్పెక్ట్రం విక్రయ అంశంపై కేంద్ర టెలికం శాఖ (డాట్‌), ఇటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.
దివాలా ప్రక్రియ జరుగుతుండగా స్పెక్ట్రంను విక్రయించడానికి లేదన్నది డాట్‌ భావన కాగా, గరిష్ట విలువను రాబట్టేందుకు విక్రయమే సరైన మార్గమని ఎంసీఏ భావిస్తోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా తెలిపారు. దీనికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఏ ఉత్తర్వులు ఇచ్చినా సమ్మతమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్‌ కట్టాల్సిన బాకీలను జియో చెల్లించే అంశంపై అసలు కేంద్రం వైఖరి ఏమిటన్నది తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఏయేడాదికాయేడు ఆర్‌కామ్‌ కట్టాల్సిన బాకీల వివరాలను సమర్పించాలంటూ డాట్‌కు సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.