వాటాదారులకు ఫ్రీగా షేర్ల జారీ- బోనస్‌

కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో రైట్స్‌ ఇష్యూల సందడి కనిపిస్తోంది. ఇదే విధంగా కొన్ని కంపెనీలు బోనస్‌ ఇష్యూలను సైతం ప్రకటిస్తుంటాయి. నిజానికి ఇవి రెండూ వాటాదారులకు లబ్ది చేకూర్చేవే. అయితే ఈ రెంటి మధ్య ప్రధాన తేడా ఏవిటంటే.. బోనస్‌ అంటే వాటాదారులకు ఫ్రీగా షేర్లులభిస్తాయి. రైట్స్‌ అంటే మార్కెట్‌ ధర కంటే తక్కువలో షేర్లను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. బోనస్‌, రైట్స్‌ ఇష్యూలపై మార్కెట్‌ విశ్లేషకులు ఇలా వివరిస్తున్నారు...
రైట్స్‌- బోనస్‌ ఇలా
శుక్రవారం సమావేశమైన బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్ల జారీకి అనుమతించినట్లు అనుహ్‌ ఫార్మా తాజాగా ప్రకటించింది. అంటే వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఫ్రీగా జారీ చేయనుంది.  ఇందుకు సెప్టెంబర్‌ 11 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోగా కంపెనీలో వాటా కలిగిన వాటాదారులకు ఫ్రీగా షేర్లు లభిస్తాయి. ఇక నెల రోజుల క్రితం ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ 1:1 నిష్పత్తిలో రైట్స్‌ ఇష్యూ చేపట్టింది. ఇందుకు మార్కెట్‌ ధర కంటే 70 శాతం తక్కువగా రూ. 50 ధరను నిర్ణయించింది. జులై3 రికార్డ్‌ డేట్‌. అయితే వాటాదారులు తప్పనిసరిగా రైట్స్‌ ద్వారా షేర్లను కొనుగోలు చేయాలన్న నిబంధనేమీ లేదు. 
సర్దుబాటు ఇలా
బోనస్‌ లేదా రైట్స్‌కు రికార్డ్‌ డేట్‌ దాటాక ఆయా కంపెనీల షేర్లు సర్దుబాటుకు లోనవుతుంటాయి. ఉదాహరణకు అనుహ్‌ ఫార్మా షేరు రికార్డ్‌ డేట్‌కు మందురోజు రూ. 300 వద్ద ముగిసిందనుకుందాం. తదుపరి రోజు నుంచీ రూ. 150 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమవుతుంది. ఎందుకంటే.. బోనస్‌ షేర్ల జారీతో కంపెనీ ఈక్విటీ రెట్టింపునకు చేరుతుంది కదా! ఇదే విధంగా రైట్స్‌ జారీ తదుపరి ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ ఈక్విటీ సైతం డబుల్‌ అవుతుంది. దీంతో షేరు ధర సగానికి సర్దుబాటు అవుతుంది.