రాష్ట్రంలో ఇప్పటికే ప్రధానపార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఉభయ కమ్యూనిస్టుపార్టీలు, టీజేఎస్, ఇతర రాజకీయపక్షాలు డిజిటల్ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. జూమ్ యాప్, ఇతర సాంకేతికతల ద్వారా ఆన్లైన్ మీడియా కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం టీజేఎస్, టీటీడీపీ, ఇతర వామపక్షపార్టీలు కలిసి ఆన్లైన్లో సంయుక్తంగా అఖిలపక్ష సమావేశాలు, రౌండ్‌టేబుల్ భేటీలు నిర్వహిస్తున్నాయి. కమ్యూనిస్టుపార్టీలు ఆన్లైన్ రచ్చబండ చేపట్టాయి. వివిధ ప్రజా సమస్యలు, ప్రాధాన్యతాంశాలపై బహిరంçగసభలను కూడా డిజిటల్ తెరపై నిర్వహించాయి.
రాజకీయాలంటేనే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండడం, ఎన్నికలప్పుడైతే ఇంటింటి క్యాంపెయిన్, వీధి చివరి మీటింగ్‌లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగసభలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఉండేది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో మున్ముందు ఎన్నికలప్పుడు, ఇతర సమయాల్లో డిజిటల్ క్యాంపెయినే మాధ్యమంగా ఉపయోగపడనుంది. ఇప్పుడిప్పుడే మహమ్మారి తగ్గుముఖం పట్టే అవకాశాల్లేకపోవడంతో కనీసం ఏడాది దాకా భౌతికదూరం పాటించడం తప్పనిసరి. దీంతో ప్రజలు, కార్యకర్తలను రాజకీయపార్టీల నేతలు ముఖాముఖి కలుసుకోవడం దాదాపు అసాధ్యమే.