డిస్కమ్‌లకు రుణ సౌకర్యాల పెంపు

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లకు ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యాల పరిమితిని తాత్కాలికంగా సడలించింది. దీంతో కోవిడ్‌-19, లాక్‌డవున్‌ తదితర సవాళ్ల నేపథ్యంలో లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న పలు విద్యుత్‌ రంగ కంపెనీలు లబ్ది పొందనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఉదయ్‌ పథకంలో భాగంగా ఇప్పటివరకూ గతేడాది వర్కింగ్ క్యాపిటల్‌లో 25 శాతం వరకూ డిస్కమ్‌లకు రుణ సమీకరణకు అనుమతి ఉంది. అయితే వన్‌టైమ్‌ చర్యలకింద ఆర్థిక వ్యవహారాల కేంద్ర కమిటీ రుణ సమీకరణ పరిమితిని సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. పలు కౌంటర్లు నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. 
జోరుగా..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా పవర్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించగా.. ఎన్‌టీపీసీ 7 శాతం జంప్‌చేసి రూ. 102కు చేరువైంది. గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ 6 శాతం పురోగమించి రూ. 81ను తాకగా.. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 3.5 శాతం పెరిగి రూ. 59 వద్ద, సీఈఎస్‌సీ 2.5 శాతం పుంజుకుని రూ. 621 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో ఎన్‌హెచ్‌పీసీ 11.25 శాతం ఎగసి రూ. 23.3 వద్ద కదులుతుంటే.. అదానీ పవర్‌ 4.4 శాతం జంప్‌చేసి రూ. 39.5కు చేరింది. ఈ బాటలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎస్‌జీవీఎన్‌, టొరంట్‌ పవర్‌, ఎన్‌ఎల్‌సీ ఇండియా, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 2-1 శాతం మధ్య బలపడి ట్రేడవుతున్నాయి.