బాబు కుట్రలు సాగవు..

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం ముందు చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుట్రలు ఫలించవని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం ముందుకు వెళుతున్నారన్నారు.
‘‘ఇందులో భాగంగా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ప్రాంతాల మధ్య అసమానతలను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే సీఎం లక్ష్యం. పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక మలుపుగా మారబోతోంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును ఆమోదించడం రాష్ట్ర ప్రగతికి శుభపరిణామం. ఈ బిల్లులను ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అడ్డుకోడానికి అనేక కుట్రలు పన్నారని’’ ఆయన ధ్వజమెత్తారు
రాజ్యాంగబద్ధంగా ఈ రెండు బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించారు. శాసనసభకు ఆ అధికారం, స్వేచ్ఛ ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, వెనుకబడిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయం. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణను రాష్ట్రంలో చంద్రబాబు పార్టీ తప్ప.. అన్ని వర్గాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నారు. చివరకు రాజధాని జిల్లాలో సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే పనిలో ముఖ్యమంత్రి నిమగ్నమయ్యారు.