స్క్రీన్‌టైమ్స్. అదేపనిగా మొబైల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు అతుక్కుపోయే అలవాటు. సాధారణంగా ఇది అతి పెద్ద సవాల్. ఈ అలవాటు ఒక పరిమితిని దాటడడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుత కరోనా కాలంలో ఈ ‘స్క్రీన్‌టైమ్స్’ ఒక సిండ్రోమ్ దశకు చేరుకుందని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు దీని బారినపడి చాలా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఇది ‘ లాక్డౌన్ స్క్రీన్‌టైమ్స్’గా యువతను పట్టి పీడిస్తోంది. ఆన్లైన్ తరగతుల వల్ల స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు లాక్డౌన్ స్క్రీన్‌టైమ్స్ వ్యసనంలా వేధిస్తోంది. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం వల్ల మానసిక వికాసంలో స్తబ్దత కనిపిస్తుండగా ‘స్క్రీన్‌టైమ్స్’ దానికి మరింత ఆజ్యం పోస్తోందని డాక్టర్లు పేర్కొంటున్నారు. దీనివల్ల పలు మానసిక సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. కరోనా ఉధృతం కావడం, సాధారణ జనజీవితంపై నెలకొన్న అనిశ్చితి ఇందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ‘స్క్రీన్‌టైమ్స్’ టీనేజ్ పిల్లలకు అతి పెద్ద సవాల్‌గా మారింది.
రోజుకు 7 గంటలు దాటితే అంతే..
చిక్కడపల్లికి చెందిన పదో తరగతి అమ్మాయి కొంతకాలంగా ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండు గదుల ఇంట్లో కుటుంబమంతా కలిసి ఉంటారు. తాను ఒక గదికి పరిమితమై ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆన్లైన్ క్లాస్‌లు వింటుంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్లోనే పలు ఫీచర్లు వీక్షిస్తూ గడిపేస్తుంది. అదేపనిగా ఫోన్ చూస్తుండడంతో తల్లి ఆంక్షలు విధించింది. దీంతో ఆ అమ్మాయిలో విపరీతమైన కోపం, అసహనం, చికాకు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యుడిని సంప్రదించగా ‘తనకు జీవితంలో ఫ్రీడమ్ లేకుండా పోయిందని, చనిపోవాలనిపిస్తోందని’ సదరు అమ్మాయి డాక్టర్ వద్ద ఏకరువు పెట్టింది. కావలసినంత సమయం మొబైల్‌ఫోన్ చూసేందుకు తల్లి అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.