ప్రభుత్వ మార్గదర్శకాలు తుంగలోకి..

జనావాసాల మధ్యన కోవిడ్‌ వ్యర్థాలను నిర్లక్ష్యంగా తరలిస్తున్న ఓ ఆస్పత్రి నిర్వాకంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంజారాహిల్స్‌ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ‘విరించి’ ఆస్పత్రి ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా.. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు.. కనీస రక్షణ చర్యలు లేకుండానే సాధారణ వ్యర్థాలతో పాటే కోవిడ్‌ వ్యర్థాలను తరలిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామంతో నిత్యం ఆస్పత్రికి వస్తున్న సాధారణ రోగులు, వారి బంధువులతో పాటు ప్రధాన రహదారి, ఆ పక్కనే ఉన్న జనావాసాల నుంచి రాకపోకలు సాగిస్తున్న సాధారణ ప్రజలు కోవిడ్‌ బారిన పడుతున్నారు. మరికొందరు ముందున్న ముప్పును తలచుకుంటూ బెంబేలెత్తుతున్నారు. ఇక ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు, వారి బంధువులు తమ వాహనాలను రోడ్డుపై నిలుపుతున్నారని..
ఆస్పత్రి యాజమాన్యం వారికి పార్కింగ్‌ వసతి కల్పించడంలో విఫలమవడంతో నిత్యం ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌జాం ఏర్పడుతోందని ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవలే ఈ ఆస్పత్రికి నోటీసులు జారీచేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో నిత్యం మురుగు నీరు ఉప్పొంగుతుందంటూ జలమండలి సైతం విరించి ఆస్పత్రికి నోటీసులు జారీచేయడం గమనార్హం. నిత్యం నగరంలో కోవిడ్‌ కేసులతోపాటు రోగులు వాడిపడేసిన వ్యర్థాలు సుమారు టన్నుకు పైగానే వెలువడుతున్నాయి. వీటిని కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా పడవేస్తుండడం.. మరికొందరు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా తరలిస్తుండడంతో అనర్థాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇళ్లలో హోం ఐసోలేషన్‌లో ఉన్న కోవిడ్‌ రోగులు వాడి పడేసిన వస్తువులు సైతం సాధారణ చెత్తతో పాటే పారవేస్తుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్యారోగ్యశాఖ సీరియస్‌గా దృష్టి సారించాలని సిటీజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.  
కోవిడ్‌ వ్యర్థాలివే.. 
ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులు వాడిన మాస్క్‌లు, గ్లౌజులు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజీలు, కాటన్, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్స్, మెడిసిన్‌ కవర్స్‌ తదితరాలను కోవిడ్‌ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. ఆయా వ్యర్థాల పరిమాణం రోగుల సంఖ్యతో పాటే అంతకంతకూ పెరుగుతూనే ఉండడం భయాందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యర్థాలను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లోని బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ కేంద్రాల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో శుద్ధి చేయాల్సి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సాధారణ చెత్తతోపాటే ఈ వ్యర్థాలను తరలిస్తుండడంతో అనర్థాలు తలెత్తుతున్నాయి.