జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి. ఈ ఏదాడి కోవిడ్ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్ నాటికి పతకాల సాధనలో భారత్ టాప్-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్‌లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు.