ప్రకృతి చర్య... కరోనా వైరస్‌ వల్లే


కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థను గట్టిగానే తాకిందని, ఈ ప్రకృతి చర్యతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2020–21) వృద్ధి పడిపోనుందని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 41వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం గురువారం ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 2020–21లో రాష్ట్రాలు జీఎస్‌టీ ఆదాయాల రూపంలో రూ.2.35 లక్షల లోటును ఎదుర్కోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. జీఎస్‌టీ అమలు కారణంగా (పాత వ్యవస్థ నుంచి కొత్త పన్ను చట్టానికి మళ్లడం) రాష్ట్రాలు ఎదుర్కొనే లోటుకు సంబంధించి తాము పరిహారం చెల్లిస్తామని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.3 లక్షల కోట్ల మేర పరిహారంగా ఇవ్వాల్సి వస్తుందన్నది కేంద్రం అంచనా. ఇందులో రూ.65,000 కోట్లను వివిద రకాల సెస్సుల రూపంలో కేంద్రం రాబట్టుకోనుంది. దీంతో రూ.2.35 లక్షల కోట్ల మేర కేంద్రం లోటును ఎదుర్కోనుంది. ఈ లోటులో రూ.97,000 కోట్లు రాష్ట్రాలు జీఎస్‌టీకి మళ్లడం కారణంగా చెల్లించాల్సిన మొత్తమని, మిగిలిన మొత్తం కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన ప్రభావమేనని అంచనా. ‘‘ఈ ఏడాది అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. సుమారు 10 శాతం కంటే తక్కువ ప్రభావం ప్రకృతి విపత్తు కారణంగానే ఉంటుంది. ఇది ఆర్థిక వ్యవస్థ సంకోచానికి కూడా కారణమవుతుంది’’ అని చెప్పారు. ఈ నెల 31న జీడీపీ క్యూ1 గణాంకాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.